
అమరావతి , 27 నవంబర్ (హి.స.)
కనకదాస జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కనకదాస చేసిన ఆధ్యాత్మిక సేవలను, ఆయన భక్తి భావాన్ని స్మరించుకున్నారు. కనకదాస జయంతి వేళ ఆయనకు హృదయపూర్వకంగా వినమ్ర నివాళులు అర్పిస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఉడిపిలోని శ్రీకృష్ణుడిపై కనకదాసకు ఉన్న అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసం ఎంతో ప్రత్యేకమైనవని పవన్ తెలిపారు. భగవంతుడిపై ఆయన చూపిన అంకితభావం భక్తులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భక్తి మార్గంలో కనకదాస సాగించిన ప్రయాణం, ఆయన అందించిన సందేశాలు నేటికీ సమాజానికి ఎంతో విలువైనవని అభిప్రాయపడ్డారు.
కనకదాస బోధనలు కేవలం ఆధ్యాత్మిక మార్గానికే పరిమితం కాకుండా మనిషి జీవన విధానానికి కూడా దిశానిర్దేశం చేస్తాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఆలోచనలు, ఆదర్శాలు భావితరాలకు నిరంతరం స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. కనకదాస ఆశయాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని ఆయన చూపిన మార్గంలో పయనించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్