మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. నషా ముక్త్ భారత్ యాత్రలో సినీ ప్రముఖులు
హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ యాత్ర మూడో రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది.
Kishan Reddy


హైదరాబాద్ , 27 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లో నషా ముక్త్ భారత్ యాత్ర మూడో రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. యువతతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం అమీర్పేట నుంచి పాదయాత్ర ప్రారంభమై ఫిల్మ్నగర్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.

నటులు సాయికుమార్, శివారెడ్డి, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ పాదయాత్రలో పాల్గొని ప్రజలకు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాలు, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతాయని ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.

మరోవైపు హీరో అక్కినేని నాగార్జున నషా ముక్త్ భారత్ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత సమాజం ఏర్పడాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మత్తు పదార్థాలపై పోరాటం ప్రభుత్వానికే పరిమితం కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో సాగాలని ఈ యాత్ర ద్వారా చాటిచెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande