
సూర్యాపేట, 27 నవంబర్ (హి.స.)
సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో బంగారం దుకాణంలో చోరీ ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని దొంగలు దుకాణంలోకి చొరబడి విలువైన బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కోదాడలో ఉన్న ఓ బంగారం దుకాణాన్ని లక్ష్యంగా చేసుకున్న దొంగలు పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దుకాణం పైభాగంలో ఉన్న రేకులను తొలగించి లోపలికి ప్రవేశించారు. అనంతరం దుకాణంలో ఉన్న ఆభరణాలను తీసుకెళ్లారు. ఈ ఘటనలో సుమారు మూడు తులాల బంగారం, ఐదు కిలోల వెండి చోరీకి గురైనట్లు సమాచారం.
దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు ఆభరణాలతో పాటు దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ఎత్తుకెళ్లారు. ఆధారాలు లభించకుండా చేసేందుకే కెమెరాలను అపహరించి ఉంటారని భావిస్తున్నారు. దుకాణంలో చోరీ జరిగిన విషయం వెలుగులోకి రావడంతో యజమాని ఆందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. దొంగలను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్