లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు
సంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచగొండి ఉద్యోగులపై చర్యలు చేపట్టారు. సదాశివపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
Acb


సంగారెడ్డి జిల్లా, 27 నవంబర్ (హి.స.)

సంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచగొండి ఉద్యోగులపై చర్యలు చేపట్టారు. సదాశివపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్న సమయంలో అధికారులు వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సదాశివపేట మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న రాజేశ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి శివారెడ్డి ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటున్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో ముందస్తు ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం లంచం తీసుకుంటున్న సమయంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది.

ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకోవడానికి ప్రజలు, కాంట్రాక్టర్లు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో ఏసీబీ అధికారులు అవినీతి నిరోధక చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో కలకలం నెలకొంది. పట్టుబడిన ఉద్యోగులపై తదుపరి విచారణ చేపట్టి, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande