
అమరావతి , 28 నవంబర్ (హి.స.)
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పునాది వేసిన గొప్ప సంఘసంస్కర్తగా పూలే సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. విద్య ద్వారానే సమాజంలో సమూల మార్పులు తీసుకురావచ్చని నిరూపించిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.
సమాజంలో అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించడంతో పాటు మహిళల అభ్యున్నతి, సాధికారత కోసం ఆయన నిరంతరం కృషి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలకు విద్య అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి మహిళా విద్యకు కొత్త దారులు చూపించారని గుర్తుచేశారు. ఆ కాలంలో మహిళలు విద్యకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో వారి చదువు కోసం పూలే చేసిన ప్రయత్నాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని తెలిపారు.
కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని సీఎం పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం పూలే చేసిన సేవలు నేటి తరానికి కూడా మార్గదర్శకమని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్