అమరావతి నిర్మాణం ఆగదు.. పనుల వేగాన్ని చాటిచెప్పిన మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు కొనసాగుతున్న తీరును మంత్రి నారా లోకేశ్ ప్రజలకు వివరించారు.
Lokesh


అమరావతి , 28 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు కొనసాగుతున్న తీరును మంత్రి నారా లోకేశ్ ప్రజలకు వివరించారు. రాజధాని అభివృద్ధి పనుల పురోగతిని తెలియజేస్తూ ‘అమరావతి నాడు-నేడు’ పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనులు, వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఈ వీడియోలో చూపించారు. అనంతరం దీనిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న బృందాల కృషి, అంకితభావం రాజధాని అభివృద్ధికి ప్రధాన బలమని లోకేశ్ పేర్కొన్నారు. పట్టుదలతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కృషి వల్ల నిర్మాణ పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ప్రజల రాజధాని అమరావతి కలను సాకారం చేసే దిశగా ప్రతి వంద రోజులకు ఒక కొత్త ముందడుగు పడుతోందని వెల్లడించారు.

రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాన్ని మంత్రి తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. అమరావతి అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘అమరావతి నిర్మాణం ఆగదు’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. రాజధాని పనుల తాజా పరిస్థితిని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ వీడియోను విడుదల చేసినట్లు ఆయన పోస్టు ద్వారా వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande