
హైదరాబాద్ , 03 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖేలో ఇండియా పోటీల నిర్వహణ కోసం తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితం కాకుండా, శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా అత్యున్నత ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మరో ఐదు నగరాల్లో మొత్తం 20 వేదికలపై ఖేలో ఇండియా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం పర్యవేక్షణ బాధ్యతలను గ్రూప్-1 అధికారులకు అప్పగించాలని నిర్ణయించారు. ఆయా అధికారులు క్రీడా వేదికల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించనున్నారు.
ఖేలో ఇండియా పోటీలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు, భవిష్యత్తులోనూ క్రీడాకారులకు ఉపయోగపడేలా సదుపాయాలను నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే ప్రముఖ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్