
అమరావతి , 04 నవంబర్ (హి.స.)
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లలో కూటమి ఆధిపత్యం సాధించేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇప్పటికే కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 94 శాతం స్ట్రయిక్ రేట్ సాధించడం ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనకు ప్రజల నుంచి మంచి గుర్తింపు లభించిందన్నారు. ఎన్నికల్లో ఆశించిన స్థానాలు దక్కించుకోలేకపోయిన నాయకులు నిరాశ చెందవద్దని భరోసా ఇచ్చారు. అర్హులైన వారికి నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యం కల్పించి న్యాయం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్