
అమరావతి , 04 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 పరీక్షల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం ఏడు ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న అవకతవకలపై ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కాశీమ్బౌలిలో పీఎస్ఆర్ ఆంజనేయులు నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని పంచవటి కాలనీ, పంజాగుట్ట, నేరేడ్మెట్ ప్రాంతాల్లోనూ సోదాలు చేపట్టారు. అలాగే సికింద్రాబాద్‌లో ఉన్న ట్రూగ్రేడర్ సంస్థ కార్యాలయం, అల్వాల్‌లోని వెంకటాపురం ప్రాంతంలో అధికారులు పరిశీలనలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లో ఉన్న ఆవాస రిసార్ట్‌లోనూ తనిఖీలు నిర్వహించారు.
ఈ కేసులో కేవలం పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలకే పరిమితం కాకుండా, వాటి వెనుక ఏవైనా అక్రమ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలోనూ ఈడీ విచారణ జరుపుతోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, నిధుల ప్రవాహానికి సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాల్లో లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్