
తిరుమల, 04 నవంబర్ (హి.స.)
తిరుమల శ్రీవారి దర్శనం కోసం నడక మార్గంలో వెళ్తున్న ఓ భక్తుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన శ్రీవారి మెట్టు నడకదారిలో చోటుచేసుకుంది. మృతుడిని న్యూజెర్సీకి చెందిన ఎన్నారై సుర్జిత్రెడ్డి (52)గా గుర్తించారు.
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. సుర్జిత్రెడ్డి శ్రీవారి దర్శనం కోసం శ్రీవారి మెట్టు మార్గం గుండా కాలినడకన తిరుమలకు బయలుదేరారు. ఈ క్రమంలో నడకదారిలోని 800వ మెట్టు వద్దకు చేరుకోగానే ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనతో నడక మార్గంలో ఉన్న ఇతర భక్తులు ఆందోళనకు గురయ్యారు.
విషయం తెలిసిన వెంటనే సంబంధిత సిబ్బందికి సమాచారం అందించారు. అయితే సుర్జిత్రెడ్డి ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఎన్నారై భక్తుడు తిరుమల యాత్రలో ఇలా మృత్యువాత పడటంతో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్