వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులకు మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, పెరుగుతున్న వరద ప్రవాహాల నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Rain


అమరావతి , 04 నవంబర్ (హి.స.)

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, పెరుగుతున్న వరద ప్రవాహాల నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల కారణంగా డ్రెయిన్లలో నీటిమట్టం గరిష్ఠ స్థాయిని దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని త్వరితగతిన బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం కాలువలు, డ్రెయిన్ల ద్వారా నీరు సజావుగా వెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని అధికారులు నిరంతరం గమనిస్తూ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం వాగుల ద్వారా ప్రకాశం బ్యారేజీకి సుమారు 71 వేల క్యూసెక్కుల నీరు చేరుతోందని వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లాలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande