
అమరావతి , 04 నవంబర్ (హి.స.)
తుపాను ప్రభావం నేపథ్యంలో గుంటూరు జిల్లాలో నిర్వహించాల్సిన వీవీఐటీయూ బాలోత్సవ్ 2026 కార్యక్రమాన్ని నిర్వాహకులు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించేందుకు ముందుగా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం తుపాను కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, భారీ వర్షాల ప్రభావం ఉండటంతో కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలోత్సవ్లో పాల్గొనే చిన్నారులు, వివిధ పాఠశాలల ప్రతినిధులు ప్రయాణ సమయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
ఈ కార్యక్రమం నిర్వహించే కొత్త తేదీలపై కమిటీ త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. అప్పటివరకు పాల్గొనేవారు, తల్లిదండ్రులు నిర్వాహకుల నుంచి వచ్చే సమాచారాన్ని గమనించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత బాలోత్సవ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్