
అమరావతి , 05 నవంబర్ (హి.స.)
విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ కాంట్రాక్టు కార్మికుడు వేడి ద్రవం పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో దుంబరి దేముడు అనే కార్మికుడి శరీరంపై సుమారు 90 శాతం మేర కాలిన గాయాలయ్యాయి.
విధులు నిర్వహిస్తున్న సమయంలో సుమారు 150 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన వేడి ద్రవం ఒక్కసారిగా అతడిపై పడినట్లు తెలుస్తోంది. దీంతో దేముడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే విలవిల్లాడినట్లు సమాచారం. ఘటనను గమనించిన తోటి కార్మికులు వెంటనే స్పందించి అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అయితే, శరీరంపై అత్యధిక శాతం కాలిన గాయాలు కావడంతో అతడి ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన దుంబరి దేముడు స్వస్థలం విజయనగరం జిల్లా కొండగంగుపూడి గ్రామంగా గుర్తించారు.
ఈ ఘటనతో స్టీల్ ప్లాంట్లోని కార్మికుల్లో ఆందోళన నెలకొంది. పారిశ్రామిక ప్రాంతాల్లో విధులు నిర్వహించే కార్మికుల భద్రత, రక్షణ చర్యలపై మరోసారి చర్చ మొదలైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్