
అమరావతి , 05 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ముఖ్యనేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు కూటమి నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు.
ఓటింగ్ శాతం పెంచేందుకు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు.
ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా అక్రమాలు చోటుచేసుకున్నా, ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు పోలింగ్‌కు ఆటంకాలు కలిగించినా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఘర్షణలు తలెత్తితే సంయమనం పాటిస్తూ అధికారులకు సహకరించాలని చంద్రబాబు సూచించారు. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ముగిసేలా అప్రమత్తంగా ఉండాలని నేతలకు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్