
అమరావతి , 05 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. మొత్తం 2,721 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2026 సమగ్ర నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. దీనితో పాటు పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. నవంబర్ 11 నుంచి 30వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
డిసెంబర్ 5న అభ్యర్థుల కోసం మాక్ టెస్ట్ నిర్వహించనుండగా, డిసెంబర్ 14 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించనున్నారు. డిసెంబర్ 20 నుంచి 2027 జనవరి 13 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష పూర్తయిన రెండు రోజుల్లో ప్రాథమిక సమాధానాల కీ విడుదల చేస్తారు. అభ్యంతరాలు తెలియజేసేందుకు ఏడు రోజుల సమయం ఇస్తారు. అనంతరం తుది కీ, ఆ తర్వాత మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.
ఈ నియామకాల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, పీఈటీ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు 2,111 రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులు, 350 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులు, వివిధ సొసైటీల పరిధిలో మరో 260 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులు, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చు. అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని నిబంధనలు చదివి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్