
హైదరాబాద్ , 05 నవంబర్ (హి.స.)
తెలంగాణలో బీసీ కుల సంఘాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ బీసీ కులాలకు చెందిన సంఘాల కోసం ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు మొత్తం 37 బీసీ కుల సంఘాలకు సంబంధించిన నిధుల మంజూరు ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఇందుకు సంబంధించిన జీవో పత్రాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా కుల సంఘాల ప్రతినిధులకు అందజేశారు.
ప్రతి కులానికి ప్రత్యేక గుర్తింపు, ఆత్మగౌరవం కల్పించడంతోపాటు ఆయా సంఘాల కార్యకలాపాలకు అనువైన వేదికలు ఏర్పాటు చేయడమే ఈ భవనాల నిర్మాణం వెనుక ప్రధాన ఉద్దేశం. కుల సంఘాల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ భవనాలు ఉపయోగపడనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీసీ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కులాల అభివృద్ధికి, సామాజిక ఐక్యతకు ఆత్మగౌరవ భవనాలు దోహదపడతాయని అభిప్రాయపడుతున్నారు. నిధుల మంజూరుతో త్వరలోనే నిర్మాణ పనులు ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్