
హైదరాబాద్ , 05 నవంబర్ (హి.స.)
నల్గొండ జిల్లాలో విధి నిర్వహణకు సంబంధించిన వ్యవహారంలో శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్ సూర్యశిల్పపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కారుణ్య నియామకాలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపాదనలు పంపినట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కారుణ్య నియామకానికి సంబంధించి సూర్యశిల్ప పంపిన ప్రతిపాదనల్లో అక్రమాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన డీఎంహెచ్వో తొలుత రెండుసార్లు తిరస్కరించారు. అయినప్పటికీ సంబంధిత మెడికల్ ఆఫీసర్ మరోసారి, అంటే మూడోసారి కూడా అదే ప్రతిపాదనలను పంపినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రతిపాదనల్లో తప్పుడు వివరాలు ఉన్నాయా అనే అంశంపై అధికారులు పరిశీలన చేపట్టారు.
విచారణలో నిబంధనలకు విరుద్ధంగా, తప్పుడు ప్రతిపాదనలు పంపినట్లు తేలడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ సస్పెన్షన్కు ఆదేశాలు ఇచ్చారు. దీంతో డీఎంహెచ్వో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నియామక ప్రక్రియల్లో నిబంధనలు పాటించాల్సిందేనని, ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవనే సంకేతంగా ఈ పరిణామం నిలిచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్