మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీ మోసం.. నలుగురు అరెస్ట్
మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాల ముసుగులో ప్రజలను లక్ష్యంగా చేసుకుని అధిక వడ్డీలతో డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
Arrest


హైదరాబాద్ , 05 నవంబర్ (హి.స.)

మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాల ముసుగులో ప్రజలను లక్ష్యంగా చేసుకుని అధిక వడ్డీలతో డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి పరిధిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ వడ్డీ వ్యాపారానికి పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ముఠా అప్పుల అవసరంతో తమను ఆశ్రయించే వారికి డబ్బులు ఇచ్చి, ఆ తర్వాత భారీ మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా అప్పు తీసుకున్న కొద్ది రోజుల వ్యవధిలోనే అసలు మొత్తానికి సమానమైన డబ్బును అదనంగా చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడైంది. అంటే రూ.లక్ష అప్పుగా ఇస్తే, తిరిగి కొద్ది రోజుల్లోనే మరో రూ.లక్ష వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అత్యవసర ఆర్థిక అవసరాలతో అప్పులు తీసుకునే సామాన్యులు ఈ ముఠా బారిన పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా? ముఠా కార్యకలాపాలు ఎక్కడెక్కడ విస్తరించాయి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు అధిక వడ్డీల ఆశ చూపే అనధికారిక రుణ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande