రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు.
Vote


అమరావతి , 05 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. మొత్తం 659 జడ్పీటీసీ, 9,821 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటికే 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది.

జడ్పీటీసీ స్థానాల్లో 2,169 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఎంపీటీసీ స్థానాల కోసం 18,843 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల విధుల కోసం దాదాపు 2,01,116 మంది సిబ్బందిని నియమించింది.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మకమైన 8,904, అత్యంత సమస్యాత్మకమైన 7,160 కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. అదేవిధంగా 16,064 కేంద్రాల్లో సీసీటీవీలు, 6,000 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, 6,507 కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande