
అమరావతి , 05 నవంబర్ (హి.స.)
బంగాళాఖాతంలో చోటుచేసుకున్న వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లాలో ఉదయం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. అద్దంకి, గుడ్లూరు, నాగులపాడు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. ఓటు వేసేందుకు వస్తున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంలో అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా పోలింగ్ ప్రక్రియకు ఆటంకాలు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్