
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ...గవర్నర్ ప్రసంగంలో ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఎలాంటి ప్రస్తావన లేదని అన్నారు. రైతుల ఇబ్బందులు, ఉద్యోగాల భర్తీ గురించి లేదని, ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావించలేదని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు గోస పడుతున్నారని... ఎన్నేళ్లు అయినా వారికి బెనిఫిట్స్ అందడం లేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన చట్టాలు ఉన్నప్పటికీ వారికి అందాల్సిన సౌకర్యాలు అందడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు.
బీసీలను పూర్తిగా మోసం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. సబ్ ప్లాన్ ముచ్చటే లేదన్నారు. ప్రభుత్వ అప్పులపై స్పష్టత లేదని తెలిపారు. గవర్నర్తో ప్రభుత్వం ఏదైనా మాట్లాడించేటప్పుడు ఆలోచించాలని.. అన్నీ అవాస్తవాలు, గందరగోళమైన మాటలు మాట్లాడించారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రభుత్వం విస్మరించినంత మాత్రాన తాము విడిచిపెట్టమని... తెలంగాణ ప్రజల గొంతుకగా బీజేపీ నిలబడి పనిచేస్తుందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు.
అసెంబ్లీలో తెలంగాణ గేయం తర్వాత వందేమాతరం గేయాన్ని ఆలపించకుండా ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని అవమానించారని మండిపడ్డారు. ఎంఐఎం ఎమ్మెల్యేల తీరు సిగ్గుచేటన్నారు. వందేమాతరం వినడానికి ఆసక్తి లేకనా? లేక దేశభక్తి లేకపోవడమా అని ప్రశ్నించారు. వందేమాతరం గేయాన్ని అవమానపరిచిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్