
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో
కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ.. చార్జిషీట్ను దాదాపుగా సిద్ధం చేసినట్లు అధికార వర్గాల నుంచి సమాచారం అందుతున్నది. ఇందులో ప్రధాన నిందితుడు (ఏ1)గా ఉన్న మాజీమంత్రి కేటీఆర్పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడగా, తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొన్నది.
ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ప్రభుత్వ నిధుల వినియోగం, ఒప్పందాల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై 2024 డిసెంబర్ 19న కేసు నమోదు చేశారు. దర్యాప్తు చివరిదశకు చేరుకున్న తరుణంలో... నిందితులపై చర్యలు తీసుకునే ప్రక్రియ వేగం పుంజుకున్నది. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గతేడాది నవంబర్ లోనే గవర్నర్ నుంచి అనుమతి లభించింది. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ఏసీబీ తన పరిశీలన కొనసాగిస్తున్నది. అంతేకాకుండా ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై చర్యలకు కూడా డీవోపీటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో ఆయనకు పోస్టింగ్ దక్కకపోవడంతో చర్యలు తప్పవన్న సంకేతాలు వెలువడ్డాయి. అందుకనుగుణంగానే ఫిబ్రవరి 28న ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి అనుమతులు, ఆర్థిక లావాదేవీలు, అధికారుల నిర్ణయాలపై ఏసీబీ అధికారులు విస్తృతంగా విచారణ జరిపారు. అగ్రిమెంట్ నిబంధనల ఉల్లంఘన, సెక్రెటేరియట్ బిజినెస్ రూల్స్ అతిక్రమణపై ప్రధానంగా దృష్టి సారించారు. హెచ్ఎండీఏ ఫండ్స్ నుంచి ఫార్ములా ఈ ఆర్గనేజేషన్స్ కంపెనీకి బ్రిటన్ పౌండ్ల రూపంలో జరిగిన చెల్లింపులు, నిర్వహణ కోసం రూ.12కోట్లు, ఫెడరేషన్ ఆఫ్ మోటర్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు రూ.1.10 కోట్లు.. ఇలా మొత్తం రూ.54.88 కోట్ల చెల్లింపులపై ఏసీబీ సమగ్ర నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. అనేక మంది అధికారులను ప్రశ్నించడంతోపాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నది.
దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో ఏసీబీ అధికారులు చార్జిషీట్ను పకడ్బందీగా రూపొందించినట్లు తెలిసింది. న్యాయపరమైన ప్రక్రియలు ముగిసిన వెంటనే.. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశమున్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా కేటీఆర్, అరవింద్ కుమార్లను ఏసీబీ అధికారులు రెండు సార్లు విచారించారు. ఇద్దరినీ కలిపి విచారిస్తారని ఊహాగానాలు వినిపించినా.. అలా జరగలేదు. అయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ను విచారించిన క్రమంలో ఆయన అప్రూవర్గా మారినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..