
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)
రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలుపై
చర్చకు అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు పెడతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) అన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన విషయంలో సభను తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని ప్రకటించారు.
మూసీ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) లోన్ మంజూరు చేసిందని సీఎం సభలో చెప్పారని, కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి డీపీఆర్ (DPR) రాలేదని, లోన్ మంజూరు చేయలేదని బ్యాంకు స్టేట్మెంట్ ఇచ్చిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇక డ్రగ్స్ కేసుతో కేటీఆర్కు ఎలాంటి సంబంధం లేదని, డ్రగ్స్ సంస్కృతికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు మీతో కలిసి వస్తారా.. అని ప్రశ్నించగా, తాము ఇవాళ అసెంబ్లీకి గులాబీ టీ-షర్టులు ధరించి వెళ్తున్నామని అన్నారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి సభకు వెళ్తున్నామని, దమ్ముంటే తాము పార్టీ మారలేదని చెబుతున్న వారంతా అక్కడి రావాలని హరీశ్ రావు అన్నారు.
స్పీకర్ తీరుపై విమర్శలు..
అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) నిష్పక్షపాతంగా వ్యవహరించాలని హరీశ్ రావు కోరారు. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమకు తగిన సమయం ఇవ్వడం లేదని, ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు.
రైతు భరోసా ఇప్పటికే మూడు విడతలుగా బాకీ ఉందని తెలిపారు. బీఆర్ఎస్ (BRS) ఒత్తిడి చేయడం వల్లే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వ పెద్దల నుంచి అధికారిక ప్రకటనలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు పెట్టి తీరుతామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు