
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)
రాహుల్ గాంధీని తిడితే కేటీఆర్
(KTR) పెద్ద లీడర్ అవుతానని అనుకుంటున్నాడని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. ఇవాళ ఆమె అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. కేటీఆర్ను ఎవరూ గుర్తిస్తలేరనే భయంతోనే తమ అధినేత రాహుల్ గాంధీని నిందించడం అలవాటుగా మార్చుకున్నాడని ఫైర్ అయ్యారు. తాను గ్రేట్ లీడర్ అవుతానని కేటీఆర్ పగటి కలలు కంటున్నాడని సెటైర్లు వేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజా ప్రభుత్వం ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.. పథకాల చట్టబద్ధత గురించి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇతరులను అనే ముందు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నాయకుల డ్రగ్స్ దందా గురించి సమాధానం చెప్పాలన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఆ పార్టీ నేతపై చర్యలు తీసుకోకపోవడమే వారి చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. వాళ్ల వారసత్వాన్ని వాళ్ల నేతలు ఫామ్ హౌస్లలో కొనసాగిస్తున్నారు తప్ప ప్రజల్లో కాదంటూ ఫైర్ అయ్యారు. ఇక కేంద్రంలోని బీజేపీ వైఫల్యాల మీద మాట్లాడాలంటే కేటీఆర్కు వణుకు పుడుతుందని, అందుకే తెలంగాణలో కాంగ్రెస్పై విషం చిమ్ముతున్నారని సీతక్క మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు