పట్టాలెక్కనున్న 'ప్రాణహిత' ప్రాజెక్టు.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలు
హైదరాబాద్, 16 మార్చి (హి.స.) ఉమ్మడి రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాలనుకుంది. కానీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. అ
Pranahita


హైదరాబాద్, 16 మార్చి (హి.స.)

ఉమ్మడి రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాలనుకుంది. కానీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును పక్కన పెట్టేసింది.

అంతేకాకుండా ప్రాణహిత నుంచి లొకేషన్ చేంజ్ చేసి మేడిగడ్డ వద్ద కాళేశ్వరం నిర్మించింది. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక ప్రాణహిత ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది.

ప్రాణహిత నదీ జలాలను తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి తరలించేందుకు ఈ ప్రాజెక్టును కొత్తగా డిజైన్ చేస్తున్నారు. ఈ మేరకు అలైన్మెంట్ సర్వే పూర్తయి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందినట్లు సమాచారం. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబరులో రూ.11.88 కోట్లతో టెండర్లను పిలవగా ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ టెండర్ దక్కించుకుని ప్రాజెక్టు అలైన్మెంట్ రిపోర్టును ఇటీవల ప్రభుత్వానికి అందజేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత జియోగ్రాఫికల్, హైడ్రాలజీ, వరద అంచనా తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి పూర్తిస్థాయి డీపీఆర్ రూపొందించనున్నారు.

2008లో ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్ట్ పనులను ప్రారంభించింది.

సుమారు రూ.10 వేల కోట్ల వ్యయంతో తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు మొత్తం 76.5 కిలోమీటర్ల మేర కాల్వలను తవ్వారు. తర్వాత రాజకీయ పరిణామాలు, ప్రాజెక్ట్ రూపకల్పనలో మార్పులతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కాగా ప్రస్తుత ప్రభుత్వం గతంలో తవ్విన కాల్వలను వినియోగిస్తూనే సుందిళ్ల బ్యారేజీ వరకు కొత్త అలైన్మెంట్ రూపొందించింది. దీని ప్రకారం మైలారం నుంచి మిట్టపల్లి వరకు 19.3 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాలని ప్రతిపాదించింది. ఆ తర్వాత సుందిళ్ల బ్యారేజీ వరకు 13.8 కిలోమీటర్ల కొత్త కాల్వ తవ్వేలా డిజైన్ సిద్ధం చేసింది. మొత్తం 109.7 కిలోమీటర్ల మేర నీటి మార్గం ఏర్పడేలా ప్రణాళిక రూపొందించింది.

ప్రాజెక్ట్ రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. గత డీపీఆర్ ప్రకారం మైలారం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోసే విధానం ఉండేది. అయితే.. భారీ ఖర్చు, నిర్వహణ వ్యయం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో లిఫ్ట్ కాకుండా గ్రావిటీ ద్వారా నీటిని సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించేలా కొత్త అలైన్మెంట్కు ప్లాన్ చేసింది. దీనిద్వారా విద్యుత్ వినియోగం తగ్గడమే కాకుండా నిర్వహణ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లిఫ్ట్ నిర్మాణం అవసరం లేకపోవడంతో కాల్వ పొడవు కూడా సుమారు 6 నుంచి 7 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉన్నది. ప్రాణహిత నదీ జలాలను సుందిళ్ల బ్యారేజీకి తరలించడం ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు తాగునీటి అవసరాలను కూడా తీర్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande