
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)
ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావం తెలుగు రాష్ట్రాలను తాకింది. పెట్రోలు, డీజిల్ సరఫరాలో ఇబ్బందుల్లేకున్నా గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్ చేసిన సరఫరాకు వారంపైనే పడుతోంది. పట్టణ ప్రాంతాల్లో కొంత నయమనిపిస్తోంది. కమర్షియల్ సిలిండర్ల కొరత వల్ల అక్కడక్కడా హోటల్స్ పై ప్రభావం చూపుతోంది. ఇంటివాడుక గ్యాస్ బుకింగ్ చేసిన వినియోగదారులకు ఏజెన్సీలు వెంటనే సరఫరా చేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్యాస్ బుక్ చేసిన వెంటనే అడగొద్దు... కనీసం వారం రోజులు పడుతుందంటూ కొన్ని ఏజెన్సీలు వినియోగదారులకు స్పష్టం చేస్తున్నాయి. గ్యాస్ డెలివరీకి పట్టణాల్లో 25 రోజులు పల్లెల్లో 45 రోజులు వ్యవధి పెట్టారు. దీంతో గృహిణులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరా విషయంలో డీలర్లు స్పష్టత ఇవ్వకపోవడంతో చాలా చోట్ల హోటల్ యజమానులు ఆందోళన చెందుతున్నారు.ఈ పరిస్థితుల వల్ల సుమారు 20 శాతం వరకు చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. విజయనగరం, శ్రీకాకుళం లాంటి పట్టణ కేంద్రాల్లో కట్టెలు పొయ్యిపై వంటలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులు ప్రకటిస్తున్నారు. దేశానికి అవసరమైన ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. గ్యాస్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి రావడం, కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆలస్యం కావడం వంటి అంశాలు ప్రజల్లో అనుమానాలకు దారి తీస్తున్నాయి.
కొరత నిజంగా గ్యాస్, చమురు కొరత ఉందా? లేక డీలర్లు, సరఫరా వ్యవస్థలో ఎక్కడైనా కృత్రిమ సృష్టిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్కు సంబంధించి ఇదే తరహా కొరత వచ్చే అవకాశం ఉందని భావించిన వాహన దారులు పెట్రోలు బంకుల వద్ద క్యూ కట్టేస్తున్నారు.
గ్యాస్ సరఫరాలో ఎటువంటి సమస్య లేదని అధికార వర్గాలు ప్రకటిస్తున్నాయి. వినియోగదారులు ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం వేరేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరా వ్యవస్థపై అధికారులు సమగ్రంగా పరిశీలించి స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..