
అమరావతి, 16 మార్చి (హి.స.)
అమరజీవి పొట్టిశ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన త్యాగం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. మహాత్మా గాంధీజీ అడుగుజాడల్లో నడిచి, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఆయన.. జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేసుకున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం.. ముఖ్యంగా తెలుగువారిక ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం చేశారు. అలాంటి అమరజీవి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.
అమరజీవి ఆత్మార్పణకు గుర్తుగా..
కాగా.. పొట్టిశ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల ముగింపు నేపథ్యంలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రంకోసం 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణ చేసిన ఆ అమరజీవికి గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ పేరుతో ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు, కూటమి నేతలు ఈ క్ర్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా.. విగ్రహం తయారీకి రూ.150 కోట్లు ఖర్చవ్వగా.. 30 టన్నుల కంచు, 70 టన్నుల బరువైన ఇనుప గడ్డర్లను వాడారు. కృష్ణాజిల్లా బొమ్ములూరుకు చెందిన కళాకారులు ఈ విగ్రహాన్ని దశలవారిగా తయారు చేసి అమరావతికి పంపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV