
హైదరాబాద్, 17 మార్చి (హి.స.) : కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్నగర్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 6.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మంగళ, బుధవారాల్లో చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ సూచించింది. ఈదురు గాలులు 40 నుంచి 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో పంటలకు, తోటలకు నష్టం వాటిళ్లే ప్రమాదముందని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోయాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ