
విశాఖపట్నం 17 మార్చి (హి.స.)
, : రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. రాయలసీమ జిల్లాల్లో సోమవారం భానుడు నిప్పులు కురిపించాడు. రాష్ట్రంలోనే అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.6 డిగ్రీలుగా నమోదైంది. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టాయి. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పిడుగులతో పాటు గంటకు గరిష్ఠంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని తెలిపింది.
వాతావరణ అనిశ్చితి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో సోమవారం ఈదురుగాలులు, వడగళ్లతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ కాసి.. ఒక్కసారిగా కుండపోత వాన పడింది. వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ