
మడకశిర, 17 మార్చి (హి.స.) మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి గాను ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ సతీష్కుమార్, ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు శాఖ, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో డ్రగ్స్ వాడకంతో అనర్థాలు, శిరస్త్రాణం వినియోగంతో ప్రాణరక్ష అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సినీ తారలతో పాటు భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. తొలుత సినీతారలు, ప్రజాప్రతినిధులు డ్రగ్స్ వాడొద్ధు. జీవితాన్ని నాశనం చేసుకోవద్ధు. హెల్మెట్ వాడుదాం.. ప్రాణాన్ని రక్షించుకుందాం అనే నినాదాలు రాసిన టీషర్టులను ధరించి పట్టణంలో భారీ ఎత్తున ద్విచక్రవాహనాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల సమాజంలో యువశక్తి విచ్ఛిన్నం అవుతోందని, నేరాలు పెరుగుతున్నాయని వాపోయారు. శ్రీసత్యసాయి జిల్లాలో గతేడాది 546 రోడ్డు ప్రమాదాలు జరిగితే... అందులో 246 మంది చనిపోగా 180 మంది ద్విచక్రవాహనాల ప్రమాదంలోనే మరణించారన్నారు. ఇందుకు అతివేగం, శిరస్త్రాణం ధరించకపోవడమే ప్రధాన కారణం అని తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డా.శ్రీనివాసమూర్తి, వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్థాలు, శిరస్త్రాణం ధరించాలని నిర్వహించిన కార్యక్రమానికి సినీ తారలు హాజరై సందడి చేశారు. హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు హెబ్బాపటేల్, అనన్య, హాస్యనటుడు రఘుకు పట్టణ వాసులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం ముగియగానే పెద్దసంఖ్యలో వచ్చిన అభిమానులు.. సినీతారలతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ