
అమరావతి, 18 మార్చి (హి.స.),:ఏపీలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు(బుధవారం) ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ బస్సులో ప్రయాణించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలో మీటర్ల మేర దివ్యాంగులతో కలిసి నేతల ప్రయాణం కొనసాగింది.
ఈ సందర్భంగా దివ్యాంగులతో నేతలు సరదాగా సంభాషించారు. వారి బాగోగులు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు నేతలు. డాన్ బాస్కో స్కూల్, డోలాస్ నగర్, ప్రకాశ్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక బస్ స్టాండ్కు చేరుకున్నారు. పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్ధిదారులు తరలివచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చిన ఈ కానుకతో సుమారు 12.76 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ