
భద్రాద్రి కొత్తగూడెం, 18 మార్చి (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం జిల్లాలోని టేకులపల్లి మండలంలో విస్తృత స్థాయిలో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో పదో తరగతి పరీక్షలు, విద్యార్థుల పఠన సామర్థ్యం, పాఠశాల మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నిర్వహణను సమగ్రంగా తనిఖీ చేశారు. ముందుగా టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థుల హాజరు శాతం, పర్యవేక్షణ చర్యలను సమీక్షించి, విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై సంబంధిత ఉపాధ్యాయుల నుంచి వివరాలు పొందారు. ఈ పరీక్షా కేంద్రంలో 180 మంది విద్యార్థులు కేటాయించగా అందరూ హాజరయ్యారని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. కలెక్టర్ అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించబడేలా చూడాలని సూచించారు.
మాస్ కాపీయింగ్కు ఏవైనా అవకాశాలు ఉండకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని, పరీక్షా పత్రాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు. అదనంగా, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాలకు అనుమతించరాదు అని హెచ్చరించారు.పాఠశాల భవనాలను పరిశీలించిన సందర్భంలో స్లాబ్ పెచ్చులు ఊడిపోవడం, ఆవరణలో పరిశుభ్రతలేమి ఉండటం గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, భవనాలకు మరమ్మత్తులు పూర్తి అధికారులకు ఆదేశించారు. చేయాలని అవసరమైన సంబంధిత పరీక్షల సమయంలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టంగా సూచించారు.అనంతరం కోయగూడెం ప్రాథమిక బాలుర ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, తరగతి గదులను సందర్శించారు. 9వ తరగతి విద్యార్థుల ఇంగ్లీష్, తెలుగు పాఠ్యపుస్తకాలను చదివించి, వారి పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠ్యాంశాలు చదవడంలో వెనుకబడిన విద్యార్థుల పరిస్థితిని గమనించి, ఉపాధ్యాయులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పఠన సామర్థ్యం విద్యార్థుల భవిష్యత్తుకు పునాది, కాబట్టి తక్షణ చర్యలు చేపట్టాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు