సాగునీటి రంగానికి రూ.11,500 కోట్లు
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం సుమారు రూ.11,500 కోట్లు బడ్జెట్లో కేటాయిం
Irrigation


హైదరాబాద్, 18 మార్చి (హి.స.)సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం సుమారు రూ.11,500 కోట్లు బడ్జెట్లో కేటాయించనున్నట్లు తెలిసింది. కాళేశ్వరంతో సహా మరికొన్ని ప్రాజెక్టులకు తీసుకొన్న రుణానికి అసలు, వడ్డీ తిరిగి చెల్లింపు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణకు కాకుండా పనుల కోసం ఈ మేరకు కేటాయించనున్నట్లు ఆర్థికశాఖ నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. గత సంవత్సరం పనులకోసం రూ.12,534 కోట్లు, అసలు, వడ్డీ చెల్లించడానికి, ఉద్యోగుల జీతాలు, నిర్వహణకోసం రూ.11,694 కోట్లు కేటాయించారు. అయితే పనుల కోసం సుమారు రూ.ఏడు వేల కోట్లు చెల్లించగా, రుణాల తిరిగి చెల్లింపునకు మాత్రం భారీ మొత్తం ఇచ్చింది. రూ.35 వేల కోట్లకు పైగా చెల్లించింది. తక్కువ వడ్డీకి తెచ్చి కాళేశ్వరం కార్పొరేషన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తీసుకొన్న రుణాలు తిరిగి చెల్లించడంతో ఖజానాపై భారం తగ్గుతుందని, దీనిని పరిగణనలోకి ప్రభుత్వం భారీ మొత్తం తిరిగి చెల్లించడం వల్ల ఏడాదిలో సుమారు రూ.ఐదు వేల కోట్ల వరకు ఆదా అయినట్లయిందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల బిల్లులు సుమారు రూ.17 వేల కోట్లు ఖర్చు చేయగా, ఇందులో పాత బిల్లులకు రూ.6,900 కోట్లు చెల్లించారు. ప్రాధాన్యంగా కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నా అక్కడున్న భూసేకరణ సమస్యల కారణంగా ముందుకు వెళ్లడం లేదు. భూసేకరణ ప్రాధాన్యాన్ని గుర్తించి పనుల కోసం ఇచ్చే నిధులతో సంబంధం లేకుండా జూన్ వరకు రూ.ఐదు వేల కోట్లు ప్రత్యేకంగా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ మొత్తం సాగునీటి పనులకోసం కేటాయించే బడ్జెట్లో కలిపి ఉంటుందా లేదా అన్నది 20వ తేదీ తెలియనుంది.

వచ్చే మూడేళ్లలో 16 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవడానికి రూ.44,632 కోట్లు అవసరం అవుతాయని, ఇందులో 2026-27వ సంవత్సరంలో 4.71 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి తెచ్చేలా పనులు పూర్తి చేయడానికి రూ.28,078 కోట్లు అవసరమని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. అన్ని ప్రాజెక్టులకు కలిపి రూ.80,751 కోట్లు 2026-27వ సంవత్సరంలో అవసరమని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ప్రతిపాదనలు పంపగా, ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం దీనిని రూ.42 వేల కోట్లకు కుదించి ప్రభుత్వానికి పంపింది. ఇందులో రుణాల కోసం చెల్లించే మొత్తం కూడా కలిపి ఉంది. అయితే పనుల కోసం సుమారు రూ.11,500 కోట్లు కేటాయించనున్నందున సాగునీటి రంగానికి మొత్తం ఎంత కేటాయిస్తారో చూడాల్సి ఉంది. అనేక ప్రాజెక్టుల్లో నిధులు ఖర్చవుతున్నా, భూసేకరణ సమస్యలతో ఆయకట్టుకు మాత్రం నీరందడం లేదనే అభిప్రాయం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande