
హైదరాబాద్, 18 మార్చి (హి.స.)రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు పనితీరును మూడు ముక్కల్లో చెప్పాలంటే ఎగ్గొట్టు.. కూలగొట్టు.. చెడగొట్టు.. అన్నట్లుగా ఉంది. పథకాలు అమలు చేయకుండా ఎగ్గొట్టడం.. పేదల నిర్మాణాలను కూల్చడం.. అమల్లో ఉన్న పథకాలను చెడగొట్టడం.. గత 28 నెలల కాలంలో చేసిందీ చేస్తోంది ఇదే’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా శాసనసభలో మంగళవారం ప్రసంగించారు. ‘దిల్లీ నుంచి వచ్చిన రాహుల్గాంధీ సైతం ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికలప్పుడు ప్రకటించారు. 2023 డిసెంబరు 23న ఆనాటి గవర్నర్ తమిళిసైతో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తున్నామని చెప్పించారు. చట్టబద్ధత దస్త్రంపై సీఎం సంతకం చేశారని ఆనాడు చెప్పుకొన్నారు. ఆ ఫైల్ ఇప్పుడెక్కడికిపోయింది? ఆచూకీ కనిపెట్టేందుకు సిట్ ఏర్పాటు చేయాలి.
‘తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భారాస హయాంలో ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగంగా ఎదిగింది. ఇప్పుడు మందగమనంలో ఉంది. మందు గమనం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతోంది. భూములు, వాహనాలు రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ వంటి ఆదాయాలు తగ్గాయి. గవర్నర్ ప్రసంగానికి ఎందుకు ధన్యవాదాలు తెలపాలి? ఆయనతో అబద్ధాలు పలికించినందుకా? యూరియా అడిగిన రైతులను లాఠీ దెబ్బలు కొట్టినందుకా? నిరుద్యోగ భృతి ఇవ్వనందుకా? ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, పీఆర్సీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నందుకా? గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీ పదం లేకుండా జాగ్రత్తపడ్డారు. సీఎం తనను తాను కర్ణుడని చెప్పుకొన్నారు.. ఇప్పుడు కుంభకర్ణుడయ్యారు. దిల్లీ వెళ్లి నిధులు తెస్తారనుకుంటే.. నిధులు ఇచ్చి వస్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో 3.13 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులన్నారు. మంత్రి శ్రీధర్బాబు ఇటీవలే 3.60 లక్షల కోట్లని ప్రకటించారు. ఏది వాస్తవం?
దర్జాగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతుల్లో పెట్టాం. నాడు ఉసేన్ బోల్ట్లా పరిగెత్తిన ఆర్థికవ్యవస్థ ఈరోజు ఎందుకు చతికిలపడిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డే ఎకానమీని అస్తవ్యస్తం చేసి నైట్ ఎకానమీ తీసుకువస్తామని అంటున్నారు. దారం తెగిన కైట్ ఎకానమీ మాదిరిగా మార్చారు. 4 నెలలుగా రాష్ట్రం నెగెటివ్ ద్రవ్యోల్బణం చవిచూస్తున్నది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఫార్మా సిటీ భూసేకరణ ఫార్మా అవసరాలకేనన్న నిబంధనలు ఉన్నాయి. కాలుష్య పరిశ్రమలు వద్దంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడెలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తారు? బుల్డోజర్ రాజ్యంగా మార్చారు. హైడ్రాతో అరాచకం చేస్తున్నారు. భూముల చుట్టే ఈ ప్రభుత్వం పరిభ్రమిస్తోంది. తుపాకీ పెట్టి బెదిరిస్తే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తారా?’ అని ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్