
మెదక్, 18 మార్చి (హి.స.)
అక్రమంగా ఆవులను, దూడలను
పట్టుకొని తరలిస్తున్న మూడు వాహనాలను పోలీసులకు అప్పగించిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం తూప్రాన్ వైపు నుంచి సంగారెడ్డి వైపు మూడు లారీలలో అక్రమంగా గోవులను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక హిందు వాహిని, బిజెపి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ తదితర హిందూ సంఘ నాయకులు స్థానిక చౌరస్తా వద్ద వాహనాలను అడ్డుకొని తనిఖీ చేయడంతో ఆవులు లేగ దూడలు ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వాహనాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి తరలించి అక్కడ విచారణ చేపట్టారు. అనంతరం బీరంగూడ గోశాలకు తరలించినట్లు తెలిసింది. అయితే మూడు వాహనాలలో సుమారు 100కు పైగా గోవులు, ఆవులు ఉన్నట్లు హిందూ సంఘ నాయకులు తెలిపారు. వాహనాలలో ఒకదానిపై ఒకటి కిక్కిరిసి ఆవులను దూడలను వేయడంతో వాటికి ఊపిరాడక అందులో కొన్ని అప్పటికే చనిపోయి ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు