
కుక్కునూరు, 19 మార్చి (హి.స.), : పోలవరం నిర్వాసితులకు ఒక రోజు ముందే ఉగాది వచ్చింది. పండగ కానుకగా బుధవారం అమరావతిలో రూ.226.61 కోట్లు పరిహారంగా పంపిణీ చేశారు. గిరిజన నిర్వాసితులకు భూమిని పంపిణీ చేసేందుకు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో గిరిజనేతర రైతుల నుంచి కొనుగోలు చేశారు. వాటికి సొమ్ము చెల్లించి, వాటిని గిరిజనులకు పంచేందుకు ఈ నిధుల్లో కొన్నింటిని కేటాయించారు.
41.15 కాంటూరు పరిధిలో 2027 జులై నాటికి నీటిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ ప్రక్రియ పూర్తి కావాలంటే ఆ సమయానికి ఆ స్థాయిలో ముంపునకు గురయ్యే గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల పునరావాస కాలనీల నిర్మాణం వేగవంతం చేశారు. అందుకు సంబంధించిన బిల్లులను చెల్లించేందుకు కొంత మొత్తం కేటాయించారు. ఇంటి విలువ చెల్లింపుల్లో కొంతమంది నిర్వాసితులకు చెల్లింపులు పూర్తి చేసేందుకు మరికొంత మొత్తాన్ని కేటాయించారు. అయితే ఆ నిర్వాసితుల జాబితాలో జిల్లా నుంచి లబ్ధి పొందిన వారి శాతం తక్కువగా ఉంది. ఎక్కువగా పోలవరం జిల్లాలోని వారికి ఆ ఖాతా కింద ఎక్కువ మొత్తం కేటాయించారు.
21 నెలల్లో..కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి పండగకి పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు జరుగుతుండటం గమనార్హం. ఇప్పటి వరకూ అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో రూ.1943 కోట్లు చెల్లించారు. 2025 జనవరిలో సంక్రాంతికి రూ.800 కోట్లు చెల్లించగా.. సింహభాగం జిల్లాలోని నిర్వాసితులకు చేరాయి. రెండో విడతగా గత నవంబరులో దీపావళి పండగ సందర్భంగా రూ.916 కోట్లు జమ చేశారు. ఆ నిధుల్లో కూడా జిల్లాలోని నిర్వాసితులకే ఎక్కువ శాతం అందాయి. ఇప్పుడు మూడో విడతగా ఉగాదిని పురస్కరించుకొని రూ.226.61 కోట్లు చెల్లించడంతో ఆనందంలో ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ