
అమరావతి, 19 మార్చి (హి.స.)
ఉగాది పర్వదినాన్న పురస్కరించుకుని తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేశ్( శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగు తీసుకురావాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రగతిలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ఉండాలని కోరుకుంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో సీఎం, మంత్రి ట్వీట్ చేశారు.
‘షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో పాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలి. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలి’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
‘తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా అందరికీ సర్వశుభాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సరంలో ప్రజాసంక్షేమం, రాష్ట్ర ప్రగతిలో దేశంలోనే అగ్రస్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి ఇళ్లల్లో ఆయురారోగ్య ఆనందాల ఉత్సవం తీసుకొచ్చే ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ లోకేశ్ ఎక్స్లో పోస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ