
అమరావతి, 19 మార్చి (హి.స.)తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం వేళ.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రాబోయే 7 నెలల్లో 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం వివరించింది. మే మాసంలో ఉన్నత విద్యా శాఖలో 1,500 ఉద్యోగాలు, ఆగస్టులో హోం శాఖలో 2,778, ఇతర శాఖల్లో 928 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సెప్టెంబర్లో గ్రూప్-2 పరీక్ష ద్వారా 750 పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొంది.
ఇంజనీరింగ్ విభాగంలో 503, ఇతర శాఖల్లో 506 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇక అక్టోబర్లో పాఠశాల, ఇంటర్మీడియట్ బోర్డులతో కలిపి 3,004 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం గణాంకాలతో సహా వివరించింది. తాము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేళ కూటమిలోని పార్టీల నేతలు ప్రజలకు హామీ ఇచ్చిన విషయం విదితమే. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వరుసగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ