
కూచ్‌బిహార్: 02 మార్చి (హి.స.)ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో తొలంగించిన 63.66 లక్షల ఓట్లలో 50 లక్షలకు పైగా చొరబాటుదారులవేనని భారతీయ జనతా పార్టీ(భాజపా) అధ్యక్షుడు నితిన్ నబీర్ ఆరోపించారు. భాజపా చేపట్టిన పొరిబోర్టన్(పరివర్తన) యాత్రను కూచ్‌బిహార్‌లో ఆదివారం ప్రారంభించిన ఆయన ఈ మేరకు ప్రసంగించారు. ‘‘50 లక్షలకు పైగా చొరబాటుదారులను ఓటరు జాబితా నుంచి తొలగించారు. వీరంతా చట్టబద్ధమైన పౌరుల హక్కులను ఉల్లంఘించడంతో పాటు దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు. దేశ ప్రజలకు ఉద్దేశించిన ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వీరు పొందుతున్నారు. నకిలీ ధ్రువపత్రాలను జారీచేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారందరికీ రక్షణ కల్పించారు. పార్టీ ఓటరు బ్యాంకు అయిన చొరబాటుదారులను జాబితా నుంచి తొలగించకుండా ఉండేందుకు ఆమె కోర్టును ఆశ్రయించారు. అక్రమ వలసదారులంతా రాష్ట్రాన్ని వీడే సమయం వచ్చింది. చొరబాటుదారుల కోసమే పనిచేసే అవినీతి ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలి. రాష్ట్ర ప్రజలు నిజమైన మార్పు కోరుకుంటున్నారు’’ అని నబీన్ వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు