
తిరుపతి, 22 మార్చి (హి.స.): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చిత్తూరు పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. పాకాల–కాట్పాడి రైల్వే లైన్ పనులను ప్రారంభిస్తున్నామని, ఇది రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తుందని చెప్పారు. అలాగే కేంద్రీయ విద్యాలయాలను జిల్లాలోకి తీసుకురావడంలో కీలక ముందడుగు వేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మంజూరైన 14 కేంద్రీయ విద్యాలయాల్లో రెండు చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
గ్రామీణాభివృద్ధి విషయంలో కూడా పలు చర్యలు చేపట్టినట్లు ఎంపీ పేర్కొన్నారు. 149 గ్రామాల్లో గ్రామ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. వ్యవసాయానికి అవసరమైన నీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, హంద్రీ-నీవా ప్రాజెక్ట్ పనులను వేగంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. విద్యా రంగంలో గురుకుల విద్యాలయాల్లో కనీస వసతులను మెరుగుపరిచామని చెప్పారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధి దిశగా ఎంఎస్ఎంఈల ద్వారా సుమారు 2 వేల కొత్త పరిశ్రమలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. దీని వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.
అదేవిధంగా పీఎం సూర్యఘర్ పథకం కింద సబ్సిడీతో సౌరఫలకాలను అందిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తూ, చిత్తూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్