
నెల్లూరు, మార్చి22 (హి.స.): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీపడకుండా ముందుకెళ్తోందని చెప్పుకొచ్చారు. ఈరోజు(ఆదివారం) నెల్లూరు జిల్లాల్లో పర్యటించి, పలు కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో రాజకీయాలు ఇంత ప్రశాంతంగా ఉన్న పరిస్థితి లేదని తెలిపారు.
తమ ప్రభుత్వానికి రెండేళ్ల సమయం కూడా పూర్తి కాకుండానే వైసీపీ నేతలు తమపై మాటల దాడులు చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో మంచి పరిశ్రమ వస్తే, కావాలనే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి నారా లోకేశ్పై కావాలనే జగన్ అండ్ కో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఏపీవ్యాప్తంగా త్వరలో శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు.
దాని కంటే ముందే, నెల్లూరు రూరల్లో అభివృద్ది పనుల జాతర జరుగుతోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం నిరుత్సాహపడకుండా.. అవి వచ్చే వరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తారని తెలిపారు. తన అన్న వివేకానందరెడ్డి రాజకీయాల్లో తనను ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. అలాగే కోటంరెడ్డి సోదరులను చూస్తుంటే తనకు తన అన్న వివేకా గుర్తుకువస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్