
ఏలూరు , 22 మార్చి (హి.స.)సైబర్ నేరగాళ్లు ఎంతటి వారినైనా వదలడం లేదు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరూ వీరి వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్ర)సైబర్ మాయాగాళ్ల వలలో చిక్కకుని భారీగా నష్టపోయారు. కేవలం ఒకే ఒక్క క్లిక్తో ఆయన బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోయింది.
ఆర్టీఏ) చలానా పేరుతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మొబైల్కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో ఆయన వాహనానికి సంబంధించి ట్రాఫిక్ చలానా పెండింగ్లో ఉందని, దాన్ని చెల్లించాలని కోరుతూ లింక్ పంపారు. అది నిజమైన చలానా అని నమ్మిన ఎమ్మెల్యే, ఆ మెసేజ్లో ఉన్న లింక్ను క్లిక్ చేశారు. అది ఓ మాల్వేర్ ఉన్న యాప్ డౌన్లోడ్కు దారితీసింది. లింక్ ఓపెన్ చేసిన కాసేపటికే జంగారెడ్డిగూడెంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ బ్రాంచ్లో ఉన్న ఆయన ఖాతా నుంచి ఏకంగా రూ. 12 లక్షలు మాయమయ్యాయి.
తన ఫోన్ హ్యాక్, నగదు విత్డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో షాక్కు గురైన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సైబర్ క్రిమినల్స్ ఐపీ అడ్రస్ ట్రాకింగ్, యాప్ డేటా విశ్లేషణ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నిందితులను అదుపులోకి తీసుకోవడం కోసం అన్ని విధాలుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు పలు సూచనలు చేశారు. చలానాలు, గిఫ్ట్ వోచర్లు, కేవైసీ (KYC) అప్డేట్ పేరుతో వచ్చే లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అధికారిక వెబ్సైట్లు మాత్రమే చూడాలని తెలిపారు. ట్రాఫిక్ చలానాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ (e-Challan) లేదా అధికారిక యాప్స్ మాత్రమే వాడాలని సూచించారు. ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది మీ కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్ రీడ్ చేయడానికి పర్మిషన్ అడిగితే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అన్నారు. ఒకవేళ మీరు మోసపోతే తక్షణమే 1930 నంబర్కు కాల్ చేయండి లేదాwww.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ