
హైదరాబాద్, 22 మార్చి (హి.స.)
పలు రంగాల అభివృదికి సూచికగా నిలిచే తలసరి ఆదాయ వృద్ధిరేటులో రంగారెడ్డి జిల్లా రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. తలసరి ఆదాయాన్ని ఏటేటా గణనీయంగా మెరుగుపర్చుకుంటున్న జిల్లా రూ.11,29,735 తలసరి ఆదాయంతో ఈసారి కూడా తనకు సాటిలేదని మరోసారి రుజువు చేసుకున్నది. రెండవ స్థానంలో హైదరాబాద్ జిల్లా రూ.4,76,679 లు, చివరి స్థానంలో హన్మకొండ జిల్లా రూ.2,37, 809ల ఆదాయంతో నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే-2026 ప్రకారం.. తలసరి ఆదాయ గణాంకాల్లో రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోని ఏ జిల్లాకు అందనంత ఎత్తులో నిలిచి సంపన్న జిల్లాగా రికార్డ్ సృష్టించింది. జాతీయ సగటు కంటే కూడా జిల్లా తలసరి ఆదాయం చాలా వ్యత్యాసంతో ముందున్నది. ఐటీ, ఫార్మా, స్తిరాస్థి రంగా ల అసాధారణ వృద్ధి ఈ ఘనతకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్లో భాగంగా ఉంటూ వస్తున్న రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తూ వ స్తోంది. పల్లె, పట్నం కలబోతతో శరవేగంగా విస్తరిస్తూ ఐటీ, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ముచ్చర్ల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న ఫోర్త్ సిటీ ఏర్పాటులో భాగంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ దేశాల పారిశ్రామిక వేత్తలను ఇటువైపుగా ఆకర్షించింది. గతంలో కంటే పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రంగారెడ్డి జిల్లాలోనే ఉంది. ఔటర్ రింగు రోడ్డుతో పాటు త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డు ఒనగూరనుండడం, వివిధ ప్రాంతాలకు అంశాలు జిల్లాతో కనెక్టివిటీ ఉండేలా అత్యాధునిక రహదారులు, మెట్రో పాలిటన్ మౌలిక సదుపాయాలు ఉండడం వంటి పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు దోహదపడుతున్నాయి. ఒకప్పుడు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్వంటి ప్రధాన ప్రాంతాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు జిల్లాలోని నలు మూలలకూ విస్తరించి భూముల విలువలు, ఆస్తుల విలువలు గణనీయంగా పెరిగాయి. అనేక ప్రముఖ పరిశ్రమలు, టెక్ పార్కులు, బళజాతి సంస్థల కార్యాలయాలు, స్టార్టప్ కంపెనీలు కొలువుదీరడంతో స్థానికులతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కలిగాయి. నైపుణ్యం కలిగిన కార్మికులు సైతం ఉపాధి కోసం పెద్ద ఎత్తున ఇక్కడకు వచ్చి స్థిరపడి పోతున్నారు. ఇవన్నీ కూడా తలసరి ఆదాయంలో జిల్లాను అగ్రభాగంలో నిలిపేందుకు దోహదపడ్డాయి.
ఓ వైపు రియల్ ఎస్టేట్ రంగం ఊపు మీద ఉన్నప్పటికీ..రంగారెడ్డి జిల్లా వ్యవసాయంలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 115 వ్యవసాయ గణాంకాల ప్రకారం.. ఎక్కువ మంది రైతులు ఉన్న జిల్లాల జాబితాలో నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలు మొదటి, రెండవ స్థానాల్లో ఉండగా.. 3.49 లక్షల మంది రైతులతో రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఎక్కువ విస్తీర్ణం ఉన్న జిల్లాల జాబితాలోనూ రంగారెడ్డి జిల్లా 2.91 హెక్టార్లతో మూడో స్థానంలో ఉంది. వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉన్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తుండగా.. వ్యవసాయ ఉత్పత్తుల్లో రంగారెడ్డి జిల్లా కీలక పాత్ర పోషిస్తున్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..