
అమనంతపురం, 22 మార్చి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకుంటున్న జనసేన పార్టీ, ఇప్పుడు పొరుగు రాష్ట్రాలలోని అనుభవజ్ఞులైన నేతలను కూడా ఆకర్షిస్తుంది. కర్ణాటకలోని చిక్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1996 ఉప ఎన్నికల్లో జనతా దళ్ తరపున గెలిచి ఎమ్మెల్యేగా పనిచేసిన పి.ఎస్. ప్రకాష్, తాజాగా జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
పి.ఎస్. ప్రకాష్ కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, కన్నడ భాష, సంస్కృతి పరిరక్షణ కోసం జరిగిన 'గోకాక్ ఉద్యమం' వంటి పలు సామాజిక పోరాటాల్లో చురుకైన పాత్ర పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవం పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటకలోని తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పార్టీ విస్తరణకు ఆయన తోడ్పాటునందిస్తారని జనసేన వర్గాలు ఆశిస్తున్నాయి.
ఈ సందర్భంగా జనసేన నాయకత్వం స్పందిస్తూ.. ప్రకాష్ వంటి అనుభవజ్ఞులైన నేతల చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రజా కేంద్రక పాలనను అందించాలనే తమ లక్ష్యానికి ఇది ఊతమిస్తుందని పార్టీ పేర్కొంది. అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ చేరికతో అటు ఆంధ్రప్రదేశ్లోనూ, ఇటు కర్ణాటక సరిహద్దు జిల్లాల్లోనూ జనసేన కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV