
శ్రీశైలం, 23 మార్చి (హి.స.)
తమ బస్సుకు సైడ్ ఇవ్వలేదన్న అక్కసుతో కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సు డ్రైవర్.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దౌర్జన్యానికి దిగాడు. ఆవేశంతో ఊగిపోతూ మరి కొందరు ప్రయాణికులతో కలిసి దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా వారి బస్సులోకి బలవంతంగా ఎక్కించి గంటకు పైగా బస్సును లాగిస్తూ, అలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ సంఘటన నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. ఆదివారం ఉదయం శ్రీశైలం శిఖరం వద్ద వరుసగా బస్సులు నిలిచాయి. ఆ బస్సుల క్రమాన్ని కాదని పక్క నుంచి వచ్చిన కేఎ్సఆర్టీసీ (కేఏ28 ఎఫ్ 2571) బస్సు రోడ్డు దిగడంతో టైర్ పంక్చర్ అయింది. ఇందుకు కారణం నువ్వేనంటూ.. అన్నమయ్య జిల్లా పీలేరు డిపోకు చెందిన (ఏపీ40జెడ్ 0616) కడప - తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాంద్ బాషాపై కర్ణాటక డ్రైవర్ సంగప్ప చలువారి గొడవకు దిగాడు.
శిఖరం దాటి కొంత దూరం వెళ్లిన ఏపీ బస్సును మార్గ మధ్యలో ఓవర్టేక్ చేసి అడ్డగించాడు. పీలేరు డ్రైవర్ చాంద్బాషా బస్సు దిగి.. ఇదేమిటని అడగడానికి యత్నిస్తుండగా అతడిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దాడికి పాల్పడుతున్న డ్రైవర్, కండక్టర్లకు బస్సులోనే ఉన్న కొందరు కన్నడిగులు కూడా సహకరించారు. అందరూ కలసి డ్రైవర్ చాంద్బాషాను బలవంతంగా వారి బస్సులోకి ఎక్కించారు. దోర్నాల చేరే వరకు దారి పొడవునా సుమారు గంటకు పైగా ఇష్టానుసారంగా చితకబాదారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ