
మంగళగిరి, 23 మార్చి (హి.స.), రాష్ట్రంలోనే తొలిసారిగా తెదేపా కార్యకర్తలు, నాయకుల కోసం మంత్రి లోకేశ్ ఆదేశాలతో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఆదివారం మంగళగిరిలోని ఈద్గా మైదానంలో ఆస్టర్ రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటుచేశారు. దాదాపు 530 మంది కార్యకర్తలు, నేతలకు వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యులు కార్తిక్ చౌదరి, గుండె వైద్య నిపుణులు పెద్ది నవీన్ కృష్ణ, న్యూరాలజిస్ట్ మీనా, ఆర్థోపెడిక్ వైద్యులు భరత్ చంద్ర, చైతన్య, వసంతి, రావెల నీరెన్ వైద్యసేవలందించారు.
డాక్టర్ కార్తిక్ చౌదరి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు, నేతల ఆరోగ్యంపై లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమన్నారు. కార్యకర్తల ఆరోగ్య సమాచారాన్ని పార్టీ గుర్తింపు కార్డుతో అనుసంధానించడం వల్ల అత్యవసర సమయంలో వారికి ఏ విధమైన వైద్యం అందించాలనే అంశంపై స్పష్టత ఉంటుందన్నారు. మూడు నెలలకోసారి ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తామని వైద్యులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ