
హైదరాబాద్, 23 మార్చి (హి.స.) దేశంలో ఇంధన కొరత ఏర్పడుతోందన్న
ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. భారత్కు చెందిన ఎల్పీజీ (LPG), ముడి చమురు (Crude Oil) నౌకలు ఒక్కక్కటిగా హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని దాటుతుండటం ఒకింత ఉపశమనం కలిగిస్తున్నది. తాజాగా మరో రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్ను దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అనుమతితో జగ్ వసంత్ (Jag Vasant), పైన్ గ్యాస్ (Pine Gas) అనే రెండు ఎల్పీజీ నౌకలు సోమవారం ఉదయం హర్మూజ్ను దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
త్వరలోనే ఈ నౌకలు దేశీయ పోర్టులకు చేరనున్నాయి. దాంతో దేశీయంగా వంట గ్యాస్ లభ్యత మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఉద్రిక్తతల కారణంగా భారత్కు చెందిన నౌకలు రోజుల తరబడి అక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మన నౌకలు సురక్షితంగా హర్మూజ్ దాటేందుకు ఇరాన్ అధికారులతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరిపింది. ఫలితంగా కొన్ని రోజుల నుంచి భారత నౌకలు ఒక్కొక్కటిగా దేశీయ పోర్టులకు చేరుకుంటున్నాయి. అయితే, ఇరాన్ సీనియర్ లీడర్ అలీ లారిజానీ మరణం, ఆ దేశ చమురుక్షేత్రాలపై అమెరికా దాడులు వంటి కారణాలతో నౌకల ప్రయాణానికి అనుమతులు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తున్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..