మారనున్న దేశ రాజకీయ ముఖచిత్రం.. భారీగా పెరగనున్న లోక్సభ, అసెంబ్లీ స్థానాలు
ఢిల్లీ, 24 మార్చి (హి.స.) దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం (Govt. Of India) కీలక అడుగులు వేస్తోంది. లోక్సభ సీట్లతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను భారీగా పెంచాలని యోచిస్తోంది. సోమవారం ఢిల్లీ (Delhi)లో జరిగిన ఎన్డీఏ
ి


ఢిల్లీ, 24 మార్చి (హి.స.)

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం (Govt. Of India) కీలక అడుగులు వేస్తోంది. లోక్సభ సీట్లతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను భారీగా పెంచాలని యోచిస్తోంది. సోమవారం ఢిల్లీ (Delhi)లో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో కేంద్రం ఈ ప్రతిపాదనలను వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడంలో భాగంగా, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను దాదాపు 50 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 543 నుంచి 816కి చేరనున్నాయి. అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఉణ్న అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6,185కి పెరగనున్నాయి.

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 179కి పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి చేరనున్నాయి. సాధారణంగా నియోజకవర్గాల పునర్విభజన కొత్త జనాభా గణన తర్వాత జరగాల్సి ఉంది. అయితే, 2021 జనాభా గణన ఆలస్యం కావడంతో, 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీనివల్ల 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే పెరిగిన సీట్లతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కూడా అమలు చేయడం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నియోజకవర్గాల పెంపునకు సంబంధించి ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170లకు సవరణలు చేయాల్సి ఉంటుంది. అయితే, జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రణను పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో NDA భాగస్వామ్య పక్షాలతో పాటు ప్రతిపక్షాలను కూడా ఒప్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అతిపెద్ద సంస్కరణగా నిలిచిపోనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande