
హైదరాబాద్, 29 మార్చి (హి.స.)
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'ధురంధర్-2: ది రివెంజ్' పేరు మారుమోగిపోతోంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. విడుదలై పది రోజులు గడుస్తున్నా, థియేటర్ల వద్ద జనం రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా 'ధురంధర్-2' హవా కొనసాగుతోంది. కేవలం 10 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా ₹1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. కలెక్షన్ల పరంగానే కాకుండా, భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరోసారి చాటిచెప్పింది. ఈ మూవీ సృష్టించిన అతిపెద్ద సంచలనం ఏమిటంటే.. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా గత 9 ఏళ్లుగా 'బాహుబలి-2' అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును 'ధురంధర్-2' బద్దలు కొట్టింది. ఒక రకంగా చెప్పాలంటే, ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం.
రణ్వీర్ సింగ్ నటన, ఆదిత్య మేకింగ్ ప్రేక్షకులను అంతలా మెప్పించాయి. ఈ చిత్రం సాధిస్తున్న విజయంపై 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. తన మూవీ రికార్డును 'ధురంధర్-2' దాటేసినా, ఆయన చాలా గొప్పగా స్పందించడం విశేషం. నిన్న నేను 'ధురంధర్-2' చూశాను. నాకు ఆ సినిమా చాలా నచ్చింది.. పూర్తిగా ఆస్వాదించాను. ఇది భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ, కొత్త బాక్సాఫీస్ బెంచ్మార్క్లను నెలకొల్పడం చూసి చాలా సంతోషంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు. అని రాసుకొచ్చారు. ఒక దిగ్గజ నిర్మాత నుంచి ఇలాంటి ప్రశంసలు దక్కడంతో ధురంధర్ టీమ్ ఫుల్ ఖుషీలో ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు