
హైదరాబాద్, 30 మార్చి (హి.స.)
ప్రస్తుతం అంతర్జాతీయ క్రిప్టో మార్కెట్లో డిజిటల్ కరెన్సీ అయిన బిట్కాయిన్ (Bitcoin) తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. గత కొద్ది రోజులుగా బిట్కాయిన్ ధర 65,900 నుంచి 66,500 డాలర్ల మధ్య కొనసుగుతోంది. మార్చి 27న 65,720 డాలర్ల కనిష్ట స్థాయికి కూడా పడిపోయింది. గత 24 గంటల్లో సుమారు 1 శాతం, గత వారం రోజుల్లో దాదాపు 4 శాతం మేర విలువను కోల్పోయిన బిట్కాయిన్, ఈ ఏడాదిలో ఇప్పటికే మూడుసార్లు ఇదే స్థాయి వద్ద నిలదొక్కుకుంది. అయితే, ఈసారి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ సపోర్ట్ లెవల్ ఎంతవరకు నిలబడుతుందనేది ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
బిట్కాయిన్ ధరల ఆకస్మిక పతనానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది మిడిల్ ఈస్ట్ వార్ ఉద్రిక్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భయాందోళనకు గురై బిట్కాయిన్ వంటి రిస్క్ ఎక్కువగా ఉండే ఆస్తులను విక్రయించి, సురక్షితమైన బంగారం వంటి వాటిపై పెట్టుబడులు పెడుతున్నారు. రెండవది మార్చి 27న ముగిసిన సుమారు 14 బిలియన్ల డాలర్ల విలువైన ఆప్షన్స్ ఎక్స్పైరీ. ఈ భారీ ఎక్స్పైరీ కారణంగా ట్రేడర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేయడం వల్ల మార్కెట్లో విపరీతమైన అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. ఇక మూడవది అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) సమావేశం తర్వాత వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చనే అంచనాలతో రిస్క్-ఆఫ్ సెంటిమెంట్ బలపడి, క్రిప్టో మార్కెట్ మొత్తం రెడ్ మార్క్ ట్రేడ్ అవుతోంది.
దీంతో రానున్న రోజుల్లో బిట్కాయిన్ గమనం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒకవేళ ప్రస్తుతం ఉన్న 66,000 డాలర్ల వద్దనే నిలబడితే, మార్కెట్ తిరిగి పుంజుకుని 68,000 నుంచి 70,000 డాలర్లకు చేరే అవకాశం ఉంది. కానీ, ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మాత్రం, ధర నేరుగా 60,000 డాలర్లకు పడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కేవలం బిట్కాయిన్ మాత్రమే కాకుండా ఎథరియం, సొలానా వంటి ఇతర ప్రధాన క్రిప్టో కరెన్సీలు కూడా 3 నుండి 5 శాతం మేర నష్టపోవడం వల్ల మార్కెట్ అంతా అనిశ్చితిలో ఉంది. ఇరాన్ చర్చల ఫలితాలు, పెరుగుతున్న చమురు ధరలు, ఫెడ్ తీసుకునే తదుపరి నిర్ణయాల బట్టి బిట్కాయిన్ ధరల్లో త్వరలోనే పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు